Kartika Masam: భక్తులతో పోటెత్తిన సముద్ర తీరాలు, నదులు!
- నేడు కార్తీక సోమవారం
- పుణ్యస్నానాలకు బారులు తీరిన ప్రజలు
- కిక్కిరిసిన శైవక్షేత్రాలు
పవిత్రమైన కార్తీకమాసంలో మూడవ సోమవారం కావడంతో, నేడు ప్రజలంతా సముద్రం, నదుల్లో పుణ్యస్నానాలు చేసేందుకు క్యూ కట్టారు. ఏపీలోని బీచ్ లన్నీ తెల్లవారుజామునే భక్తులతో నిండిపోయాయి. గోదావరి, కృష్ణా తీరాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి పుష్కర ఘాట్, కోటి లింగాల రేవు, బాసర, ధర్మపురి వంటి క్షేత్లాల్లో కిక్కిరిసిన భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీకాళహస్తిలోనూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. పంచారామాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో అర్ధరాత్రి నుంచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. సర్వదర్శనానికి 2 గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోంది. గోదావరి రేవుల వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు తిరుపతిలోని కపిలేశ్వరుని ఆలయం వద్ద ఉండే కపిల తీర్థం కోనేటి వద్ద రద్దీ అధికంగా ఉంది. తిరుమలలోనూ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,872 మంది దర్శించుకున్నారని, 29,582 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లని అధికారులు తెలిపారు.