Justice SA Bobde: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాబ్డే చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
- రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం
- హాజరైన మోదీ, అమిత్ షా
- 2021 ఏప్రిల్ 23 వరకు పదవిలో చీఫ్ జస్టిస్ బాబ్డే
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్ గా శరద్ అర్వింద్ బాబ్డే నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ బాబ్డే చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ నిన్న పదవీ విరమణ చేశారు. చీఫ్ జస్టిస్ గా బాబ్డే 13 నెలల పాటు బాధ్యతలను నిర్వహించనున్నారు.
బాబ్డే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 1956లో మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన బాబ్డే... నాగపూర్ యూనివర్శిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను సాధించారు. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో తన పేరును నమోదు చేయించుకున్నారు. సుప్రీంకోర్టులో అడుగుపెట్టక ముందు న్యాయవాదిగా, వివిధ కోర్టుల్లో జడ్జిగా ఆయన 21 ఏళ్ల పాటు పని చేశారు.
2000 మార్చ్ 29న బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలను జస్టిస్ బాబ్డే స్వీకరించారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2021 ఏప్రిల్ 23 వరకు చీఫ్ జస్టిస్ గా బాబ్డే పదవిని నిర్వహిస్తారు.