Parliament: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. ఎన్.శివప్రసాద్ కు నివాళి
- వచ్చే నెల 23 వరకు జరగనున్న శీతాకాల సమావేశాలు
- 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉమ్మడిగా సమావేశం కానున్న ఉభయసభలు
- ఇటీవల మృతి చెందిన నేతలకు సంతాపం తెలిపిన పార్లమెంటు
ఈ ఏడాది పార్లమెంటు చిట్టచివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతాలాపనతో ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాలు సమావేశాలను ప్రారంభించారు. రాజ్యసభ 250వ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం, ఇటీవల మృతి చెందిన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాం జెఠ్మలానీ, ఎన్.శివప్రసాద్ లతో పాటు ఇతర నేతలకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. ఈ సమావేశాల్లో పౌరసత్వ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉభయసభలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి.