Kanna Lakshiminarayana: ఏపీలో భారీగా మతమార్పిడులు.. ఇది మంచిది కాదు: కన్నా లక్ష్మీనారాయణ
- మతమార్పిడులను ప్రోత్సహించడం మంచిది కాదు
- దేవాలయాలను కూలగొట్టి, విగ్రహాలను తొలగిస్తున్నారు
- ఇంగ్లీష్ మీడియం కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలి
ఏపీలో మతమార్పిడులు భారీ ఎత్తున జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సమాజానికి మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలను కూలగొట్టి, విగ్రహాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసి అడ్రస్ లేకుండా పోయిందని... చివరకు క్షుద్ర పూజలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు తాము వ్యతిరేకం కాదని... కాకపోతే, తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని కోరుతున్నామని కన్నా చెప్పారు. ఇంగ్లీష్ మీడియం కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు.
చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా కొనసాగిందని... జగన్ హయాంలో కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని కన్నా విమర్శించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందేనని చెప్పారు. ఇసుక కొరతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలుత నిలదీసింది బీజేపీనే అని అన్నారు. ఇసుక కొరతపై పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నా... దున్నపోతుపై వాన పడినట్టుగానే ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు.