Chandrababu: ఇదేం జగన్మాయ? దళారులను నియంత్రించలేరా?: సీఎం జగన్ ని ప్రశ్నించిన చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు బలైపోతున్నారు
- దళారులు స్వైరవిహారం చేస్తున్నారు
- రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ?
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేరుశనగ, మొక్కజొన్న రైతులు బలైపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మొక్కజొన్న క్వింటా ధర రూ.2100 నుంచి రూ.1500కు పడిపోయే దాకా ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో దళారులు స్వైరవిహారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
వేరుశనగ పంట దిగుబడి వచ్చి రైతులు అమ్ముకోడానికి సిద్ధపడగానే మార్కెట్లో క్వింటా ధర రూ.8,200 నుంచి రూ.4 వేలకు పడిపోయిందని, ఒక్క నెలలో రైతు ఎకరానికి రూ. 20వేలు నష్టపోయాడని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ‘ఇదేం జగన్మాయ? దళారులను నియంత్రించలేరా? వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ? రైతులకు ఇచ్చే వైసీపీ ప్రభుత్వ భరోసా ఇదేనా?’ అని ప్రశ్నించారు.