Congress Chief Sonia Gandhi- NCP Chief Sharad Pawar meet: సోనియాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్

  • ఆయా పార్టీల బలా బలాలపై చర్చలు సాగాయి
  • శివసేనతో ఇంకా చర్చలు జరుపలేదు
  • ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన మిత్ర పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాం

ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అనంతరం మీడియాతో మాట్లాడారు.  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఆ మాటకొస్తే.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని  ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని పవార్ చెప్పారు.

అందరూ ఊహిస్తున్నట్టుగా తాను ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించలేదన్నారు. శివసేనతో కూడా ఇంకా చర్చలు జరుపలేదని ఆయన పేర్కొన్నారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో ఇంకా మాట్లాడాల్సి ఉందని చెప్పారు. పరిష్కరించుకోవాల్సిన అంశాలు తమ ముందున్నాయని అన్నారు. ఆయా పార్టీలకున్న బలాబలాలను సోనియాతో భేటీలో పరిశీలించడం జరిగిందన్నారు.

ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన మిత్ర పార్టీలైన, స్వాభిమాని షెట్కారీ సంఘటన్, పీసంట్స్ వర్కర్స్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, తదితర పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని పవార్ చెప్పారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో తమతో కలిసి వచ్చాయని, కొన్ని పార్టీలకు స్థానాలు దక్కలేదని.. అయినప్పటికీ వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని పవార్ చెప్పుకొచ్చారు.

కాగా, మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి ఏ పార్టీకి తగిన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వగా, అందులో వారు విఫలమవడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్, సోనియా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News