Telugudesam: అప్పుడు, ఓ కాంగ్రెస్ లీడర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి చంద్రబాబు చేసుకోలేదు: లక్ష్మీ పార్వతి ఆరోపణ
- నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రబాబు పోటీ చేశారు
- చిత్తూరు కాంగ్రెస్ నేత కూతురుని పెళ్లి చేసుకుంటానని చెప్పారు
- ఆయనకు అలా చెప్పి ఎన్నికల ఖర్చు చేయించారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. సాక్షి ఛానెల్ లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబుకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఇందిరాగాంధీ సీటు ఇచ్చిన సమయంలో ఆయన దగ్గర డబ్బులేమీ లేవని అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్ద కాంగ్రెస్ లీడర్ కూతురుని పెళ్లి చేసుకుంటానని చంద్రబాబు చెప్పి, తన ఎన్నికల ఖర్చు మొత్తం ఆయనతో పెట్టించాడని ఆరోపించారు.
ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచారని, సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి కూడా దక్కించుకున్నారని చెప్పారు. అప్పుడు చంద్రబాబు మంత్రి పదవి తెచ్చుకోవడం చాలా పెద్ద గొడవ అయిందని, మొదటి నుంచి కూడా బాబుది అడ్డదారి రాజకీయమేనని విమర్శించారు. మధ్య వర్తుల ద్వారా ఎన్టీఆర్ కూతురుని పెళ్లి చేసుకోవడానికి చంద్రబాబు ముందుకొచ్చాడని, ఈ నిర్ణయంతో ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబుకు డబ్బు ఖర్చు పెట్టారో వారు చాలా బాధపడ్డారని అన్నారు. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు ఇంత అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును ఆ నాయకుడు ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు అల్లుడిని అయితే తనకు పెట్టిన ఎన్నికల ఖర్చంతా తీర్చేస్తానని ఆ నాయకుడికి చంద్రబాబు చెప్పారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.