Narendra Modi: శరద్ పవార్ నేతృత్వంలో మోదీని కలుస్తాం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
- రైతుల సమస్యలను వివరించి చెబుతాం
- పవార్ తీరుపై మాకు ఎలాంటి అనుమానం లేదు
- మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోన్న విషయం తెలిసిందే. శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
శరద్ పవార్ నేతృత్వంలో తాము త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా, తాము ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతోన్న నేపథ్యంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడం పట్ల బీజేపీపై శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఏడో వర్థంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తోన్న సమయంలో మరోవైపు బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ తీరు ఏంటో స్పష్టమైందని తెలిపింది.