Pakistan: మా అబ్బాయి ప్రేమ విఫలమై డిప్రెషన్ కి గురయ్యాడు.. పొరపాటున పాక్ కు వెళ్లాడు: మీడియాతో ప్రశాంత్ తండ్రి
- మా కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడు
- ఢిల్లీకి వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తాను
- రెండేళ్ల క్రితం ప్రశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు
తమ దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ కూడా వారిలో ఒకరు. అతడి తండ్రి బాబూరావు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు ప్రశాంత్.. ఓ అమ్మాయిని ప్రేమించాడని, అయితే, ప్రేమ విఫలమవ్వడంతో కుంగుబాటుకు గురయ్యాడని తెలిపారు. ఈ కారణంగానే రాజస్థాన్ వెళ్లి పొరపాటున పాక్ లో అడుగుపెట్టాడని చెప్పారు.
తన కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదని బాబూరావు అన్నారు. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన కుమారుడికి ఓ అమ్మాయి పరిచయం అయిందని, అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాడని వివరించారు. తాను ఢిల్లీకి వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తానని అన్నారు. తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలని కోరతామన్నారు. తమది విశాఖపట్నమని, ప్రస్తుతం హైదరాబాద్ కూకట్ పల్లిలోని భరత్ నగర్ లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం ప్రశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని వివరించారు.