Maharashtra: 'మహా' బీజేపీకి పవార్ పవర్... మోదీ, శరద్ పవార్ ల కీలక భేటీ!
- ప్రభుత్వం ఏర్పాటుకు చర్యల దిశగా భేటీ
- డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు
- మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ
మహారాష్ట్రలో మరో నూతన రాజకీయ కూటమి ఏర్పాటు కానుందా? బీజేపీతో ఎన్సీపీ జట్టు కడుతుందా? రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుల దిశగా అడుగులు పడనున్నాయా? ఈ ప్రశ్నలకు నేడు సమాధానం లభించే అవకాశాలు ఉన్నాయి. మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మోదీ, పవార్ ల భేటీ జరుగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఏర్పడేందుకు ఈ భేటీ దోహదపడుతుందని అంచనా. కొత్త కూటమి ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలను ఎన్సీపీకి ఇచ్చేందుకు బీజేపీ ఇప్పటికే నిర్ణయించిందని, దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకే మోదీ, పవార్ ల భేటీ జరుగుతోందని సమాచారం.