Telugudesam: విజయసాయిరెడ్డి గారూ! మీ అసత్య ప్రచారాలకు ఆకాశమే హద్దు: బుద్ధా వెంకన్న
- ‘తెలుగు’ కోసం నాడు జగన్ వీరోచితంగా ఉద్యమించారు
- అప్పుడు, ఇంగ్లీషు మీడియంను ప్రజలు వ్యతిరేకించారా?
- ఏ మీడియం ఎంచుకోవాలన్న ఆప్షన్ విద్యార్థులకే ఇవ్వాలి
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధనకు కొద్ది సేపటి క్రితం జీవో జారీ అయిన విషయం తెలిసిందే. దీనిపై మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు మరోసారి స్పందించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన ఈ ట్వీట్లలో ఆయన విమర్శలు గుప్పించారు.
తెలుగు కోసం వైఎస్ జగన్ వీరోచితంగా ఉద్యమం చేసిన రోజున ప్రజలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారా? మనస్తాపానికి గురయ్యారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు, ఇంగ్లీష్ మీడియం గురించి పోరాటం చేస్తుంటే ప్రజలంతా తెలుగుని వ్యతిరేకిస్తున్నారా? ప్రతిపక్షాలపై మనస్తాపానికి గురయ్యారా? మీ అసత్య ప్రచారాలకు ఆకాశమే హద్దు విజయసాయిరెడ్డి గారూ అంటూ మండిపడ్డారు. మాధ్యమం ఎంచుకునే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే ఆప్షన్ ఇవ్వాలని, ఏ మీడియం కావాలో వారే నిర్ణయించుకుంటారని సూచించారు.