Tammareddy: జార్జిరెడ్డి రౌడీ ఎలా అవుతాడు? కచ్చితంగా హీరోనే!: తమ్మారెడ్డి భరద్వాజ
- జార్జిరెడ్డిని ‘రౌడీ’ అన్న వ్యాఖ్యలపై భరద్వాజ ఖండన
- కుల, మతాలు వుండకూడదని నమ్మిన వ్యక్తి జార్జిరెడ్డి
- ఈవ్ టీజర్లతో కొట్లాడిన వ్యక్తి జార్జిరెడ్డి
నాడు హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. జార్జిరెడ్డిని రౌడీగా అభివర్ణిస్తూ వస్తున్న వ్యాఖ్యలను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. జార్జిరెడ్డితో కలిసి చదువుకున్న తమ్మారెడ్డిని ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, యూనివర్శిటీల్లో మత, కులపరమైన చర్చలు, కులాలు, మతాలు వుండకూడదని నమ్మిన వ్యక్తి జార్జిరెడ్డి అని చెప్పారు.
నిరక్షరాస్యులకు చదువు చెప్పేవాడని, క్లాస్-4 ఉద్యోగులకు సమస్యలు తలెత్తినప్పుడు వారి పక్షాన నిలిచి పోరాడేవాడని, ఈవ్ టీజర్లతో కొట్లాడేవాడని... ఇవన్నీ చేసిన మనిషి రౌడీ ఎట్లా అవుతాడు? కచ్చితంగా ఆయన హీరోనే అని చెప్పారు. ‘మా జార్జి కథనా? వేరే జార్జి కథనా.. కమర్షియల్ సినిమానా? లేక నిజం సినిమానా?’ అన్నది ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదలైన తర్వాత గానీ చెప్పలేమని అన్నారు.