Karnataka: ఈశ్వరానందపురి స్వామీజీని ఏకవచనంతో దూషించిన మంత్రి.. క్షమాపణలు చెప్పిన సీఎం యడియూరప్ప
- ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, స్వామీజీ
- నేమ్ బోర్డు విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం
- మంత్రి తరపున క్షమాపణలు చెప్పిన సీఎం
కర్ణాటక శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ఓ స్వామీజీని దూషించారంటూ విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప క్షమాపణలు చెప్పారు. హుళియూరు కనక కూడలిలో నేమ్‌బోర్డు ఏర్పాటు విషయమై నిర్వహించిన శాంతి సమావేశంలో కురుబ కులస్తుల కాగినెలె పీఠాధిపతి ఈశ్వరానందపురి స్వామిజీ, మంత్రి మధుస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేమ్ బోర్డు విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన మంత్రి స్వామీజీని ఏకవచనంతో సంబోధిస్తూ దూషించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేబినెట్ నుంచి మంత్రిని తొలగించాలంటూ కురుబ కులస్తులు ఆందోళనకు దిగారు.
ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. మంత్రి కనుక నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఆయన తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టాలని కోరారు.
మరోవైపు, ఈశ్వరానందపురి స్వామిజీ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే, మంత్రి తనను ఏకవచనంతో దూషించలేదని పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు.