Madhya Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. కాన్పు కోసం ఎమ్మెల్యే కూతురు 12 గంటలు ఎదురుచూపు
- మధ్యప్రదేశ్ లో ఘటన
- పరిస్థితిని మీడియాకు వివరించిన ఎమ్మెల్యే సీతారాం
- ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆగ్రహం
- చివరకు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరణ
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం కారణంగా ఓ ఎమ్మెల్యే కూతురు కాన్పు కోసం 12 గంటలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే కూతురికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని విజయపూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సీతారాం ఆదివాసీ కూతురు కాన్పు కోసం షియోపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే, అక్కడ తమకు ఎదురైన అనుభవాన్ని సీతారాం మీడియాకు వివరించి చెప్పారు.
'ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించారు. నవంబరు 18న ఉదయం 9 గంటలకు మా కూతురు ధోదిబాయి (26)ని కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్చాం. అయితే, సాధారణ డెలివరీ సాధ్యం కాదని, సిజేరియన్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆసుపత్రిలో సిజేరియన్ చేయడానికి వైద్యుడు లేడని, కాసేపట్లో వస్తాడని చెప్పారు. అయితే, ఆ ఆసుపత్రిలోనే 12 గంటలు ఎదురు చూసినా వైద్యుడు రాలేదు' అని సీతారాం చెప్పారు.
'చివరకు మా అమ్మాయిని ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆ తర్వాత కూడా అంబులెన్సు ఏర్పాటు చేయడంలో చాలా ఆలస్యం చేశారు' అని అన్నారు. 'చివరకు మేము 119 కిలోమీటర్ల దూరం ఉన్న శివపురిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నా కూతురికి సాధారణ కాన్పు జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది' అని సీతారాం వివరించారు. తమను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎదురు చూసేలా చేశారని షియోపూర్ ఆసుపత్రి సిబ్బందిపై ఆయన మండిపడ్డారు.