Cricket: నేటి నుంచే చారిత్రాత్మక డే నైట్ టెస్టు..సర్వం సిద్ధం!
- ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభం
- కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్
- గులాబీ రంగు బంతితో టీమిండియా తొలి టెస్టు
చారిత్రాత్మక డేనైట్ టెస్టు మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో గులాబి రంగు బంతితో మ్యాచ్ ఆడనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 3.40 వరకు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 5.40 నుంచి 6 గంటల వరకు టీ విరామం ఉంటుంది.
క్రికెట్ లో గులాబి రంగు బంతి గతంలో తొలిసారి మహిళల క్రికెట్ లో ప్రవేశపెట్టారు. ఈ రంగు బంతితో టీమిండియా తొలి టెస్టు ఆడుతుంది. ఇప్పటికే 8 జట్లకు గులాబి రంగు బంతితో ఆడిన అనుభవం ఉంది. ఈ పింక్ టెస్టును చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా బీసీసీఐ అన్ని హంగులను సిద్ధం చేసింది. స్టేడియానికి పరిసరాల్లో ఉన్న రోడ్లను అందమైన గ్రాఫిటీలతో ముస్తాబు చేసింది. అక్కడి పరిసరాలన్నీ గులాబీ రంగులతో మెరిసిపోతున్నాయి. ఈ మైదానంలో 67 వేల సీట్ల సామర్థ్యముంది.