Kolkata Test: పింక్ బాల్ తో చెలరేగుతున్న టీమిండియా పేసర్లు.. 4 వికెట్లు.. మూడు డకౌట్లు
- 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
- పింక్ బాల్ తో తొలి వికెట్ తీసిన భారత బౌలర్ గా ఇషాంత్
- వరుసగా ముగ్గుర్ని డకౌట్ చేసిన భారత బౌలర్లు
కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న డేనైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ తో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మన పేసర్ల ధాటికి కేవలం 24 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయింది. భారత్ తరపున పింక్ బాల్ తో తొలి వికెట్ తీసిన భారత బౌలర్ గా ఘనతను ఇషాంత్ శర్మ సాధించాడు. 4 పరుగులు చేసిన ఓపెనర్ ఇర్ముల్ ను ఇషాంత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయి బంగ్లాదేశ్... 17 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.
వన్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన మొమినుల్ హక్ (డకౌట్)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. ఉమేశ్ వేసిన బంతి మొమినుల్ బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్స్ లోకి వెళ్లింది. సెకండ్ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ కుడివైపుకు డైవ్ చేస్తూ, అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ మిథున్ కూడా డకౌట్ అయ్యాడు. అతన్ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ (డకౌట్)ను మొహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇర్ముల్, మొమినుల్, ముష్ఫికర్ ముగ్గురూ వరుసగా డకౌట్ కావడం గమనార్హం.