Congress: ఫడ్నవిస్ ట్వీట్ ను రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. మహారాష్ట్ర పరిణామాలపై స్పందన
- ఎన్సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని ఫడ్నవిస్ గతంలో ట్వీట్
- ఎన్సీపీతో తాము కలుస్తామని వస్తోన్న వార్తలన్నీ వదంతులేనన్న ఫడ్నవిస్
- ప్రజలను ఆయన మోసం చేశారన్న సుర్జేవాలా
మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ తీరుపై విరుచుకుపడింది. 'ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని, ఇలాంటి తీరు కనబర్చడం ప్రజలను ద్రోహం చేయడమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కాంట్రాక్టు ఇవ్వడమే అవుతుంది' అని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో ఎన్సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ గతంలో చేసిన ట్వీట్ ను సుర్జేవాలా రీట్వీట్ చేశారు. ఎన్సీపీతో తాము కలుస్తామని వస్తోన్న వార్తలన్నీ వదంతులేనని చెప్పిన ఫడ్నవిస్ ఇప్పుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ... 'మహారాష్ట్ర రాజకీయాల గురించి నేను విన్న వార్త వింతగా అనిపించింది. ఇది నకిలీ వార్త అని అనుకున్నాను. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మధ్య వేగంగా చర్చలు జరిగి, నిర్ణయం తీసుకోవాల్సింది. ఆలస్యం జరిగిన కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి' అని అన్నారు.