shiv sena: అందుకే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపారు.. ఈ విషయాన్ని బట్టబయలు చేస్తాం: సంజయ్ రౌత్
- ధనంజయ్ ముండేతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం
- అజిత్ పవార్ కూడా తిరిగి మాతో కలిసే అవకాశం ఉంది
- ఆయనను బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేశారు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.
'బీజేపీకి మద్దతు తెలుపుతోన్న మా పార్టీ నేత ధనంజయ్ ముండేతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. అజిత్ పవార్ కూడా తిరిగి మాతో కలిసే అవకాశం ఉంది. ఆయనను బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేశారు. అందుకే ఆయన ఇలా చేశారు. మేము ఈ విషయాన్ని బట్టబయలు చేస్తూ మా పార్టీ పత్రిక సామ్నాలో త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం' అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
'అజిత్ పవార్ వెంట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిలో ఇప్పటికే ఐదుగురు తిరిగి మా వద్దకు వచ్చేశారు. తమను అపహరించి తీసుకెళ్లిన రీతిలో బీజేపీ వ్యవహరించిందని వారు అంటున్నారు' అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. కాగా, బీజేపీ బల నిరూపణలో నెగ్గుతుందా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.