Chilukuru: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆవేదనను ట్వీట్ రూపంలో వెల్లడించిన పవన్ కల్యాణ్
- ఆలయాలే పన్ను చెల్లిస్తున్నాయన్న రంగరాజన్
- చర్చిలు, మసీదుల నుంచి పన్నులు వసూలు చేయట్లేదని వెల్లడి
- ఆర్టికల్ 26 ఉల్లంఘనే అంటున్న ప్రధాన అర్చకుడు!
ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాల నుంచే పన్నులు వసూలు చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ని ఉల్లంఘిస్తోందంటూ సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ చేసిన వ్యాఖ్యలను జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ రూపంలో వెల్లడించారు.
"సెక్యులర్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాలకు వచ్చే ఆదాయం నుంచి ప్రతి ఏడాది 23.5 శాతం పన్ను రూపేణా వసూలు చేస్తున్నాయి. దేవాదాయ పరిపాలన పన్ను రూపంలో 15 శాతం, ఆడిట్ ఫీజు రూపేణా 2 శాతం, కామన్ గుడ్ ఫండ్ నిమిత్తం 2 శాతం, అర్చక సంక్షేమ నిధి, ఇతర పన్నుల రూపంలో దేవాలయాల ఆదాయంలో నాలుగో వంతు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఇదంతా కేవలం దేవాలయాలకే వర్తిస్తోంది. ఒక్క చర్చి కానీ, ఒక్క మసీదు కానీ రూపాయి కూడా పన్ను చెల్లించడంలేదు. ఆలయాలు మాత్రమే ఎందుకు పన్ను చెల్లించాల్సి వస్తోంది? ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని భారత రాజ్యాంగంలోని 26వ అధికరణం చెబుతోంది. చర్చిలు, మసీదులను వదిలేసి దేవాలయాల నుంచే ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారు? ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వండి" అంటూ రంగరాజన్ ఓ వీడియోలో పేర్కొన్న అంశాలను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, రంగరాజన్ మాటలను తప్పకుండా వినాలి అంటూ వీడియోను కూడా పోస్టు చేశారు.