Chandrababu: బొత్స సత్యనారాయణను బర్తరఫ్ చేయండి: చంద్రబాబు
- హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీ కళ్లకు శ్మశానాల్లా కనిపిస్తున్నాయా?
- ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదు
- సజీవ స్రవంతి అమరావతిని శ్మశానంగా శత్రువు కూడా పోల్చరు
ప్రజా రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చి 5 కోట్ల ఆంధ్రులనే కాకుండా, శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా మంత్రి బొత్స సత్యనారాయణ అవమానించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీ కళ్లకు శ్మశానాల్లా కనిపిస్తున్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని... అమరావతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... బొత్సను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా? రాజధాని నిర్మాణాల్లో చెమటోడ్చిన కూలీల శ్రమను ఎగతాళి చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో రూ. 52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటకులతో అమరావతి నిత్యం సందడిగా ఉండేదని చెప్పారు. అలాంటి సజీవ స్రవంతి అమరావతిని శ్మశానంగా శత్రువు కూడా పోల్చరని మండిపడ్డారు.