Narendra Modi: కర్తవ్యాన్ని పాటించకుండా మన హక్కులను కాపాడుకోలేం: మోదీ
- కర్తవ్యంలోనే హక్కుల రక్షణ ఉందని గాంధీ చెప్పారు
- పౌరుడిగా మన బాధ్యతల గురించి మనం ఆలోచించాలి
- కర్తవ్యం, హక్కుల మధ్య అవినాభావ సంబంధం ఉంది
నిష్టతో చేపట్టే కర్తవ్యం ద్వారానే హక్కులు అందిపుచ్చుకోగలమని మహాత్మా గాంధీ ఆనాడే చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్తవ్యంలోనే హక్కుల రక్షణ ఉందని అన్నారని చెప్పారు. భారత రాజ్యాంగ 70వ వార్షిక దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... అధికారంతో పాటు పౌరుడిగా మన బాధ్యతల గురించి మనం ఆలోచన చేయాలని అన్నారు. కర్తవ్యాన్ని పాటించకుండా మన హక్కులను కాపాడుకోలేమని, కర్తవ్యం, హక్కుల మధ్య అవినాభావ సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. మన కర్తవ్యం మన దేశాన్ని ఏ విధంగా మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందో పౌరులు ఆలోచించాలని సూచించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలోని ప్రజలందరూ ఐకమత్యంతో ఉన్నారని మోదీ చెప్పారు. నవంబరు 26 రాజ్యాంగం ఆమోదం పొందిన రోజని ఇది చాలా సంతోషాన్నిచ్చే రోజని అన్నారు. అయితే, ఇదే రోజు ముంబయిలో పేలుళ్లు జరగడం ఎంతో బాధకు గురిచేసే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.