Andhra Pradesh: మానసిక చికిత్సకు మమ్మల్ని పంపిస్తారో, మిమ్మల్ని పంపిస్తారో త్వరలోనే ప్రజలు చెబుతారు: మంత్రి అనిల్ వ్యాఖ్యలకు ఉమ కౌంటర్
- టీడీపీ నేతలకు మైండ్ దొబ్బిందన్న మంత్రి అనిల్
- ఘాటుగా బదులిచ్చిన ఉమ
- ఆర్నెల్లలోనే ఇంత అభద్రతా భావమా? అంటూ ఆగ్రహం
ఏపీలోని పరిస్థితులపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా అనిల్ కుమార్ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఉమ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా బదులిచ్చారు. చంద్రబాబు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టుందని, ఆయన సింగపూర్ లో చికిత్స చేయించుకుంటే మేలని అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఉమ కౌంటర్ ఇచ్చారు.
పోలవరం విషయంలో దుర్మార్గమైన ఆలోచనతో రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని ఆరోపించారు. రూ.800 కోట్లు ఆదా చేశామని చెప్పి రూ.7,500 కోట్లు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టు విషయం కోర్టులో ఉందని, అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఏ మంత్రి కూడా మాట్లాడడని విమర్శించారు. ఈ విషయాలపై తాను ప్రశ్నిస్తే మంత్రి మైండ్ దొబ్బిందని, సింగపూర్ వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక చికిత్సకు మమ్మల్ని పంపిస్తారో, లేక మిమ్మల్నే పంపిస్తారో త్వరలో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లోనే ఇంత అభద్రతాభావంతో మంత్రులు ఇష్టంవచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటిస్తానని ప్రకటించగానే జగన్ సర్కారుకు వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని తమపై విమర్శలు చేశారని, కానీ అక్కడ జరుగుతున్న పనులే వాస్తవాలేంటో చెబుతాయని వెల్లడించారు.