Devineni Uma: ఓట్లేసినందుకు కృతజ్ఞతగా కొత్తగా ఏదైనా బూతు భాష తీసుకురావాలనుకుంటున్నారా?: దేవినేని ఉమ
- వైసీపీ ప్రభుత్వంపై ఉమ ఫైర్
- అమరావతి అంశంపై విమర్శలు
- జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాధ్యతగల స్థాయిలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చారంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని శ్మశానంగా పోల్చారంటే 34 వేల ఎకరాల భూమిని ఇచ్చిన 28 వేల మంది రైతుల త్యాగాన్ని అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు.
"అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అంటున్నారు. కానీ అక్కడ లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ కోటి 70 లక్షల చదరపు అడుగుల నిర్మాణ పనులు జరిగాయి. అక్కడే సచివాలయం ఉంది, అక్కడే శాసనమండలి ఉంది. అక్కడున్న సెక్రటేరియట్ లోనే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్న చట్టాలు కూడా అమరావతిలో ఉన్న శాసనసభ, శాసనమండలిలోనూ తయారయ్యాయి.
ఇవాళ అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను దేశానికి, ప్రపంచానికి చూపించడానికే చంద్రబాబునాయుడు గారు ఈ నెల 28న అమరావతిలో పర్యటిస్తుంటే జగన్ మోహన్ రెడ్డిగారు మాట్లాడిస్తున్న భాష ఏ విధంగా ఉందో అందరూ గమనించాలి. దీనిపై జగన్ మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. మంత్రులతో మాట్లాడిస్తున్న భాషకు బాధ్యత వహించాలి. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా కొత్తగా ఏదైనా బూతు భాషను తీసుకురావాలనుకుంటున్నారా అనే విషయంపై ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలి" అంటూ వ్యాఖ్యానించారు.