tsrtc: నేటి నుంచి రెండు రోజులపాటు మంత్రిమండలి సమావేశాలు.. తేలిపోనున్న తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు!
- తొలి రోజే తేలిపోనున్న ఆర్టీసీ భవిష్యత్తు
- గ్రామీణ రూట్లలో ప్రైవేటుకు పర్మిట్లు
- తాత్కాలిక సిబ్బందిని ఏం చేయాలనేదానిపై చర్చ
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్తు ఏమిటన్నదానిపై రేపటికల్లా స్పష్టత రానుంది. నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రి మండలి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీలో కొత్త నియామకాల నిలిపివేత, రూట్లలో ప్రైవేటుకు పర్మిట్లు ఇవ్వడం వంటి వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ప్రైవేటుకు ఇచ్చే రూట్లన్నీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రైవేటుకు ఇవ్వనున్న రూట్ల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. గ్రామీణ రూట్లలో నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
వీటితోపాటు స్వచ్ఛందంగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులపై ఎటువంటి వైఖరి అవలంబించాలి? తాత్కాలిక సిబ్బందిని ఏం చేయాలి? ప్రైవేటు రూటు పర్మిట్లతోపాటు మిగిలిన రూట్ల నిర్వహణ వంటివాటిపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.