america: అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య కేసు.. నేరం అంగీకరించిన నిందితుడు!
- గత శనివారం యువతిపై అత్యాచారం, హత్య
- మాట్లాడేందుకు నిరాకరించిందనే హత్య
- గతేడాదే జైలు నుంచి విడుదలైన నిందితుడు
గత శనివారం ఉదయం అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఇండో అమెరికన్ విద్యార్థిని రూత్ జార్జ్ (19) దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడు డొనాల్డ్ తుర్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తుర్మాన్ బెయిలు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్టు అంగీకరించాడన్నారు.
యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తున్న రూత్‌ను తుర్మాన్ పిలిచాడని, ఆమె మాట్లాడేందుకు నిరాకరించిందన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని మర్ఫీ తెలిపారు. రూత్‌ను గొంతు నులమడంతో ఆమె అచేతనావస్థలోకి వెళ్లిపోయిందని వివరించారు. అనంతరం యువతిని తన కారు వెనక సీటులోకి ఎక్కించి అత్యాచారం చేశాడని తెలిపారు. అతడికి బెయిలు ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు.
ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్ల జైలు శిక్ష పడిన తుర్మాన్ రెండేళ్లు జైలులో గడిపి గతేడాది డిసెంబరులో బెయిలుపై బయటకు వచ్చాడు. అంతలోనే ఇప్పుడీ ఘాతుకానికి పాల్పడ్డాడు.