Maharashtra: పార్టీ వ్యవహారాలకే ఆదిత్య థాకరే పరిమితం.. మంత్రి పదవికి దూరం పెట్టినట్టే!

  • రాజకీయాల్లో రాటుదేలేందుకు ఇది అవసరమని అధిష్ఠానం భావన 
  • వర్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిత్య 
  • ఒకానొక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్

రాజకీయాల్లో పదవీ యోగం కూడా ఓ విధంగా అదృష్టం. అనూహ్యంగా కొందరిని ఉన్నత పదవులు వరిస్తాయి. మరికొందరు దశాబ్దాలుగా వేచివున్నా అవకాశం రాదు. రాజకీయ వైకుంఠపాళీలో సిత్రమే ఇది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకానొక దశలో శివ సేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వినిపించిన పేరు ఆదిత్య థాకరే. 


వర్లి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేసి తాను వెనుక నుంచి చక్రం తిప్పేందుకే పరిమితం కావాలనుకున్నారు శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరే. కానీ అనూహ్యంగా ఆయనే ఈ రోజు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి అవుతారని భావించిన ఆదిత్య థాకరేకు కనీసం మంత్రివర్గంలో కూడా చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు.


అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తొలినుంచీ దూకుడుగా వ్యవహరించి చక్రం తిప్పిన శివసేన తాజాగా మంత్రివర్గ కూర్పు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 'మహా వికాస్ అఘాడియా'లో భాగస్వాములైన కాంగ్రెస్, ఎన్సీపీలో మరింత నమ్మకం పాదుగొల్పడం ప్రధాన కారణం.


అదే సమయంలో పార్టీ వ్యవహారాలకు ఆదిత్యను పరిమితం చేయడం ద్వారా రాజకీయాల్లో రాటుదేలేలా చేయడం శివసేన వ్యూహమని పార్టీ వర్గాల సమాచారం. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను ఆహ్వానించేందుకు ఆదిత్యను పంపడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News