Pragya Thakur: సొంత పార్టీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పై కఠిన చర్యలు చేపట్టిన బీజేపీ!
- రక్షణ శాఖ కమిటీ నుంచి తొలగింపు
- శీతాకాల సమావేశాల నుంచి సస్పెన్షన్
- నిన్న గాడ్సేను దేశభక్తుడనడంతో తీవ్ర దుమారం
మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా, బీజేపీ అధిష్ఠానం కఠిన చర్యలకు దిగింది. ఆమె వ్యాఖ్యలను నిన్ననే రికార్డుల నుంచి తొలగించగా, రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన కమిటీలో ఆమె సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్టు ఈ ఉదయం ప్రకటన వెలువడింది.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు ఆమెను ఆహ్వానించబోవడం లేదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ శీతాకాల సమావేశాల నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు లోక్ సభ ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవేనని ఈ సందర్భంగా జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తమ పార్టీ అటువంటి వ్యాఖ్యలను సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఈ ఉదయం కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు ఉభయ సభలను కుదిపేశాయి. ఆమెను పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని, ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్షాలు వాకౌట్ చేశాయి.