Narendra Modi: విదేశీ ప్రయాణాల్లో విమానాశ్రయాల్లోనే మోదీ స్నానం చేస్తారు!: అమిత్ షా
- ఎక్కడైనా ఆగాల్సి వస్తే ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లోనే విశ్రాంతి తీసుకుంటారు
- లగ్జరీ హోటల్ కు వెళ్లరు
- ఎంతో క్రమశిక్షణతో ఉంటారు
ప్రభుత్వ ఖజానాపై భారాన్ని మోపే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రధాని మోదీ ఎప్పుడూ వెనకాడరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఏదైనా ఎయిర్ పోర్టులో విమానం ఆగాల్సి వస్తే... విమానాశ్రయ టెర్మినల్ లోనే ఆయన విశ్రాంతి తీసుకుంటారని, అక్కడే స్నానాలు కూడా చేస్తారని... లగ్జరీ హోటల్ కు వెళ్లరని చెప్పారు. మోదీ వ్యక్తిగత జీవితం ఒక తెరిచిన పుస్తకమని చెప్పారు. వ్యక్తిగత జీవితమైనా, ప్రజాజీవితమైనా మోదీ ఎంతో క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. లోక్ సభలో ఎస్పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు 20 శాతం కంటే తక్కువ సిబ్బందినే తీసుకెళ్తారని అమిత్ షా తెలిపారు. అధికార ప్రతినిధుల బృందం ఎక్కువ వాహనాలను ఉపయోగించడాన్ని కూడా ప్రోత్సహించరని చెప్పారు. గతంలో ఒక్కో అధికారి ఒక్కో కారులో వచ్చేవారని, ఇప్పుడు అందరూ కలసి ఒక బస్సులోనో లేక ఒక పెద్ద వాహనంలోనో వెళ్తున్నారని తెలిపారు.
గతంలో ప్రధానులు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే... ఓ హోటల్ ను బుక్ చేసేవారని... కానీ, మోదీ మాత్రం విమానాశ్రయ టెర్మినల్ లోనే విశ్రాంతి తీసుకుంటారని అమిత్ షా చెప్పారు. దీని వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుందని తెలిపారు.