KCR: కేసీఆర్ మాటలు అవాస్తవం, ఆక్షేపణీయం: బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- చార్జీల పెంపుతో పేదలపై భారం మోపడం తగదు
- ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా నిలిచింది
- రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ ఛిన్నాభిన్నం చేశారు
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో తీసుకుంటున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే సమయంలో చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించడాన్ని బీజేపీ తెలంగాణ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ తప్పుబట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు నిధులు ఇవ్వాలే తప్ప పేద ప్రజలపై భారం పడేలా చార్జీల పెంపు తగదన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవమని, ఆక్షేపణీయమని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. ఆయన తీరుతో రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తమపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ తొలి నుంచీ అండగా ఉందని అన్నారు. వారి సమస్యలను, రాష్ట్రంలోని పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.