Priyaanka: 9.45కు ఫోన్ స్విచ్చాఫ్, 3 గంటలకు మరణం... ఆ ఐదు గంటలూ ప్రియాంకకు ఎంత నరకయాతనో!
- బుధవారం రాత్రి హత్యాచారం
- కిడ్నాప్ తరువాత ప్రాణాలతో ఐదు గంటల పాటు
- కిడ్నాప్, అత్యాచారం, హత్య... అన్నీ ఈ మధ్య కాలంలోనే
బుధవారం నాడు దారుణ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి, మరణించే ముందు దాదాపు ఐదు గంటల పాటు కామాంధుల చేతుల్లో నరకయాతన అనుభవించి వుండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఆమె రాత్రి 9.20 గంటల సమయంలో చెల్లెలు భవ్యకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాత, 9.45 గంటల సమయంలో ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆ తరువాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె మరణించినట్టు ఘటనా స్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు స్పష్టం చేశారు.
అంటే దాదాపు 5 గంటల సమయం ఆమె ప్రాణాలతోనే ఉంది. ఆ సమయంలో ఆమెకు కలిగిన కష్టమేంటి? ఆమెను కిడ్నాప్ చేసిన వారు ఏం చేశారు? అన్న విషయాలు విచారణలో వెలుగుచూడాల్సివుంది. కిడ్నాప్, అత్యాచారం, మెడకు చున్నీ బిగించి, హత్య, ఆపై మృతదేహం దహనం... ఇవన్నీ ఆ ఐదు గంటల వ్యవధిలో జరిగినవే.
రాత్రి 10 గంటల సమయంలోనే ప్రియాంక అత్యాచారానికి గురై ఉండవచ్చని, ఈ విషయంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఎంతమంది ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న విషయం కూడా తెలియాల్సివుందని చెబుతున్నారు. తనను కిడ్నాప్ చేస్తున్న సమయంలో ఆమె ప్రతిఘటించిందా? అరిస్తే ఎవరికైనా కేకలు వినిపించాయా? ఎవరూ పట్టించుకోలేదా? దుండగులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కారా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు పోలీసులు సమాధానాలను కనుగొనాల్సివుంది.
ఎందుకంటే, తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రతి నిమిషమూ వాహనాల కదలిక ఉంటుంది. పైగా రాత్రి 10 గంటల సమయమే కాబట్టి, వాహన సంచారం అధికమే. ఆ పరిస్థితుల్లో నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంత సులువైన పనేమీ కాదు. ఒకవేళ ప్రియాంకకు సాయం చేస్తామని నమ్మించిన దుండగులు, ఆమెను తీసుకెళ్లారా? అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్టు పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.