Onion: ఉల్లి ధర రూ. 500లకు చేరినా 'డోంట్ కేర్' అంటున్న గ్రామస్తులు... కారణం ఏమిటంటే..!

  • ఉల్లి, వెల్లుల్లిని ముట్టని బీహార్ లోని త్రిలోకి భిగా గ్రామస్తులు
  • శతాబ్దాలుగా వీటికి దూరంగా ఉంటున్నామన్న గ్రామ పెద్దలు
  • తమ పూర్వీకులు ఆచరించదాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామని వ్యాఖ్య

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ. 100ను తాకింది. బీహార్ లో దీని ధర రూ. 70 నుంచి 80 మధ్యలో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు బీహార్ ప్రభుత్వం రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ అసోసియేషన్ లిమిటెడ్ తరపున రాజధాని పాట్నాలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లిని రూ. 35కే అందిస్తోంది.

మరోవైపు, ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నా పాట్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి భిగా గ్రామస్తులు మాత్రం నిశ్చింతగా ఉంటున్నారు. కిలో ఉల్లి ధర రూ. 500లను తాకినా తాము పట్టించుకోబోమని చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది నిజం.

డోంట్ కేర్ అంటున్న ఈ గ్రామస్తుల వ్యాఖ్యల వెనుక ఆసక్తికర కారణం ఉంది. ఈ గ్రామంలో మొత్తం 35 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 300 నుంచి 400 వరకు ఉంటుంది. ఈ గ్రామంలోని వారంతా పూర్తిగా శాకాహారులే. వెల్లుల్లి, ఉల్లిని వీరు తమ ఆహార పదార్థాల్లో ఉపయోగించరు. అంతేకాదు మద్యానికి కూడా వీరు దూరంగా ఉంటారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు మాట్లాడుతూ, కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం లేదని చెప్పారు. తమ గ్రామంలో విష్ణువు ఆలయం ఉందని... ఈ కారణంగానే వీటిని తినడాన్ని తమ పూర్వీకులు ఎప్పుడో మానేశారని తెలిపారు. తమ పూర్వీకులు ఆచరించినదాన్ని ఇప్పటికీ తాము కూడా పాటిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఉల్లి ధర ఎంత ఉందో కూడా తమకు తెలియదని ఆ గ్రామానికి చెందిన రాంప్రవేశ్ యాదవ్ అనే వ్యక్తి చెప్పారు. గతంలో తమ గ్రామానికి చెందిన వారు కొందరు ఉల్లిని తిన్నారని... ఆ తర్వాత వారంతా యాక్సిడెంట్లకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనలతో ఇంకెప్పుడూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉల్లిని వాడకపోవడం అనేది కష్టమైన పనే అయినా... అందరం నిష్ఠగా తమ నిర్ణయాన్ని పాటిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News