TSRTC: ఆర్టీసీ సంస్థ లేకుండా చేయాలని కేసీఆర్ కుట్రపన్నారు: టీడీపీ నేత ఎల్.రమణ
- అందుకే సమ్మె విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది
- నమ్మిన కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరుతో రోడ్డుపాలు చేశారు
- టీఆర్ఎస్ రాచరిక పాలనతో తెలంగాణ వాసులకు ఇబ్బంది
తెలంగాణలో ఆర్టీసీ అన్నదే లేకుండా చేయాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందని, కానీ ఆయన అసలు రూపం బయటపడిందని టీటీడీపీ నాయకుడు ఎల్.రమణ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ కారణంగానే సమ్మె విషయంలో ప్రభుత్వం అంత మొండిగా వ్యవహరించిందన్నారు.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడడమే ఇందుకు కారణమని విమర్శించారు. కార్మికులు కేసీఆర్‌ను నమ్మితే, ఆయన వారిని రోడ్డుపాలు చేయాలని చూశారని ధ్వజమెత్తారు. కానీ కార్మికుల ఐక్య పోరాటంతో సమాజమే తిరగబడే పరిస్థితి రావడంతో కేసీఆర్ దిగివచ్చారని తెలిపారు. యూనియన్లు కొత్తగా రాలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి భాగమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.