Disha: ప్రియాంకరెడ్డి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి తలసాని
- చాలా బాధాకరమైన సంఘటన
- చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- అవసరమైతే, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతాం
వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డి హత్య ఘటనను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా బాధాకరమైన సంఘటన అని, ప్రియాంకరెడ్డి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వుండేందుకు పోలీస్ శాఖను పూర్తి స్థాయిలో ‘అలర్ట్’ చేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేసినప్పటికీ, అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు.
అవసరమైతే, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతామని, నిందితులపై తక్షణ చర్యలు చేపట్టేలా చూస్తామని అన్నారు. ప్రియాంకరెడ్డి తన సోదరికి ఫోన్ చేసినప్పుడే, ‘100’ కు కూడా ఫోన్ చేసి వుంటే బాగుండేదని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇంకా తీసుకుంటామని చెప్పారు.