Zero FIR: తెరపైకి 'జీరో ఎఫ్ఐఆర్' అంశం.. ప్రియాంకారెడ్డి హత్యతో మళ్లీ మొదలైన డిమాండ్
- సరిహద్దులతో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించే విధానం
- ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కేంద్రం దీనికి ఆమోదం
- ప్రియాంక కుటుంబ సభ్యులు ఫిర్యాదుకు వెళితే పరిధి పై మాట్లాడిన పోలీసులు
సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లోని శంషాబాద్ పరిధిలో అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంకారెడ్డి ఘటన నేపథ్యంలో తాజాగా ఈ డిమాండ్ ఊపందుకుంది.
సాధారణంగా చిన్నా, పెద్ద కేసుల నమోదు సమయంలో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకునేది ఘటన జరిగిన ప్రాంతం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నది. తమ పరిధిలోకి వస్తేనే కేసు నమోదు చేస్తారు. లేదంటే పలానా స్టేషన్‌కు వెళ్లాలని చెబుతారు. సాధారణ కేసుల్లో దీనివల్ల పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు.అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల నిండు ప్రాణాలే బలికావచ్చు. ప్రియాంకారెడ్డి ఆపదలో ఉన్నానని ఇంటికి ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
శంషాబాద్ ఆర్జీఐఏ, శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈలోగా జరగరాని ఘోరం జరిగిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ప్రియాంక తండ్రి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ జీరో ఎఫ్ఐఆర్ డిమాండ్ ఊపందుకుంది.
ఢిల్లీలో నిర్భయ హత్యాకాండ సమయంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం జీరో ఎఫ్ఐఆర్ కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదుకు వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్ కు ఓ నంబరు కేటాయిస్తారు. ఒకవేళ ఫిర్యాదు ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే నంబరు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే 'జీరో ఎఫ్ఐఆర్' అంటారు.
ఇలా ఎఫ్ఐఆర్ నమోదుచేసి బాధితుల్లో ధైర్యం ప్రోది చేస్తారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సంబంధిత స్టేషన్‌కు కేసు బదిలీ చేస్తే వారు నంబరు కేటాయిస్తారు. కేంద్రం అమోదం తెలిపినా ఈ విధానాన్ని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ముంబయిలో ఈ విధానం అమల్లో ఉన్నందున హైదరాబాద్ లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ మొదలయ్యింది.
ప్రియాంకారెడ్డి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని కుటుంబ సభ్యులతోపాటు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.