Disha: ప్రియాంక విషయంలో పోలీసులదే తప్పు.. మంత్రుల మాటలు బాధాకరం: డా.లక్ష్మణ్
- స్టేషన్ కు వచ్చిన ప్రియాంక తల్లి, చెల్లెలు పట్ల పోలీసులు సరిగా స్పందించలేదు
- కేసు తమ పరిధిలోకి రాదని చెప్పడం దారుణం
- పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా మంత్రులు మాట్లాడుతున్నారు
ప్రియాంకరెడ్డి ఇంటికి రాలేదని, తమకు చాలా భయంగా ఉందంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె తల్లి, చెల్లెలు పట్ల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాదని చెప్పడం దారుణమని చెప్పారు. ఆందోళనతో పీఎస్ కు వచ్చిన వారితో చులకనగా మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని లక్షణ్ అన్నారు. చెల్లెలితో మట్లాడకుండా 100కి ఫోన్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని మంత్రులు అంటున్నారని... పోలీసుల నిర్లక్ష్యంపై వారెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సదరు పోలీసు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం వరదలై పారుతోందని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని... వీటి వల్ల నేరాలు పెరుగుతున్నాయని అన్నారు.