Hyderabad: తప్పుచేసి ఉంటే వాడికి శిక్ష పడాల్సిందే : నిందితుడు చెన్నకేశవుల తల్లి జయమ్మ
- ప్రియాంకను ఎలా చంపారో అలాగే చంపినా పర్వాలేదు
- నా కొడుకు చేసిన పని తెలిసి నా భర్త ఆత్మహత్యా యత్నం చేశాడు
- అటువంటి కొడుకు ఉంటే ఎంత? పోతే ఎంత? అని వ్యాఖ్య
హైదరాబాద్, శంషాబాద్ పరిధిలో హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు నిజంగా తప్పుచేసి ఉంటే వాడికి ఏ శిక్ష విధించినా పర్వాలేదని అతని తల్లి జయమ్మ తెలిపింది. ప్రియాంకను చంపిన విధంగా వాడినీ చంపాలని సూచించింది. ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో నిందితులైన నలుగురిలో చింతకుంట చెన్నకేశవులు నాలుగో నిందితుడు. నిందితులను ఉరితీయాలంటూ మహిళా లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జయమ్మ నోట కూడా అదే మాట వచ్చింది.
'నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి బిడ్డల్ని కనలేదు. నాకూ ఆడపిల్లలు ఉన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకోగలను. నా కొడుకు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. జులాయిగా తిరిగే మహ్మద్ ఆరిఫ్ తో కలిసి తిరగడం వల్లే వాడు కూడా పాడై పోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయ్యిందేదో అయ్యిందిలే అని సరి పెట్టుకున్నాం. ఇప్పుడింత పని చేస్తాడనుకోలేదు. ఊరంతా మా గురించే మాట్లాడుకుంటే తలదించుకోవాల్సి వస్తోంది. ఆవమానం భరించలేక నా భర్త ఆత్మహత్యా యత్నం కూడా చేశాడు. అటువంటి కొడుకు ఉంటే ఎంత? పోతే ఎంత? వాడికి ఉరిశిక్ష వేస్తారో? కాల్చి చంపుతారో? వాళ్ల ఇష్టం' అంటూ జయమ్మ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.