Disha: అమ్మాయి కనిపించగానే కామాంధులు రెచ్చిపోతున్నారు: కిషన్ రెడ్డి
- ప్రియాంక హత్య కేసు యావత్ దేశాన్ని కదలించింది
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోబోతున్నాం
- కేసు వారి పీఎస్ పరిధిలోకి రాకపోయినా పోలీసులు స్పందించాలి
ప్రియాంక హత్య కేసు దేశ ప్రజలందరినీ కదలించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమ్మాయి కనిపించగానే కామాంధులు దారుణాలకు ఒడిగడుతుండటం సమాజానికి ఒక సవాల్ గా మారిందని చెప్పారు. ఈ కేసులో అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి, నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలను తీసుకోబోతున్నామని, చట్టాలను కూడా మార్చబోతున్నామని చెప్పారు. ప్రియాంక కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి కేసుల్లో శిక్షలు తొందరగా పడేలా చట్టాలను మార్చబోతున్నామని... ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, మధ్యలో ఏ కోర్టును ఆశ్రయించకుండా, నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లేలా చట్టాలను మార్చబోతున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఐపీసీ, సీఆర్పీసీలను మార్చుతామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడారని తెలిపారు.
తమ పీఎస్ పరిధిలోకి ఈ కేసు రాదు అని పోలీసులు చెప్పకుండా ఉండే విధంగా మార్పులు తీసుకొస్తామని... సమస్య ఎక్కడ జరిగినా, ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా మార్పులు తెస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రియాంక హత్య నేపథ్యంలో ప్రజలంతా చాలా ఆగ్రహంతో ఉన్నారని... నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.