Gun: బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది.. గన్ లైసెన్స్ ఇవ్వండి: పోలీసులకు మహిళా లెక్చరర్ దరఖాస్తు

  • హైదరాబాద్, వరంగల్ ఘటనలతో వణికిపోతున్నా
  • ఆపదలో మీరొచ్చి రక్షిస్తారన్న నమ్మకం నాకు లేదు
  • ఆయుధాల చట్టం-1959 ప్రకారం లైసెన్స్ ఇవ్వండి

హైదరాబాద్‌లో వైద్యురాలు, వరంగల్‌లో స్నేహితుడి చేతిలో బలైన యువతి ఘటనల తర్వాత మహిళల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంతో వరంగల్‌కు చెందిన ప్రభుత్వ అధ్యాపకురాలు నౌషీన్‌ ఫాతిమా తనకు తుపాకి లైసెన్స్ ఇవ్వాలంటూ వరంగల్ సీపీ వి.రవీందర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయుధాల చట్టం-1959 ప్రకారం తనకు లైసెన్స్ మంజూరు చేయాలని ఈమెయిల్ ద్వారా ఆమె దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మంలో పనిచేసే తాను ఉదయం వరంగల్ నుంచి బయలుదేరితే మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రవుతోందని పేర్కొన్న ఆమె.. కష్టసమయంలో డయల్ 100కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా సాయం కోరినా పోలీసులు వెంటనే వచ్చి రక్షిస్తారన్న నమ్మకం తనకు ఇసుమంతైనా లేదని, కాబ్టటి స్వీయ రక్షణ కోసం తనకు గన్‌లైసెన్స్ ఇవ్వాలని కోరారు. ఇవ్వకుంటే ఉద్యోగం  మానేసి ఇంట్లో కూర్చోవడం తప్ప చేయగలిగిందేమీ లేదన్నారు.  
 
వరంగల్ ఘటన హంటర్‌ రోడ్డులోని తన ఇంటికి సమీపంలోనే జరిగిందన్న నౌషీన్.. తాను రోజూ అదే మార్గంలో వెళ్తుంటానని, కానీ ఇప్పుడు అలా వెళ్లాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్ లాంటి ఘటనలు రేపు ఏ మహిళకైనా జరగొచ్చని పేర్కొన్నారు. పోలీసింగ్‌లో అత్యుత్తమంగా ఖ్యాతిగాంచిన ఇంగ్లండ్, కెనడా, నెదర్లాండ్స్‌ దేశాల్లోనే తక్షణ సాయం సాధ్యం కావడం లేదని అన్నారు. తనను తాను కాపాడుకోలేనప్పుడు తాను చదువుకున్న ఉన్నత చదువులు, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు విలువ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాబట్టి తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు.  

కాగా, ఈ ఈమెయిల్‌పై వరంగల్ సీపీ రవీందర్ మాట్లాడుతూ.. ఈమెయిల్ వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, వరంగల్‌లో తాను ఉంటున్నట్టు పేర్కొన్నా అందులో ఆమె అడ్రస్ లేదన్నారు. తుపాకి లైసెన్స్ కావాలనుకున్న వారు నేరుగా కార్యాలయానికి వస్తారని, దీనిని ఎవరో ఆకతాయిలు ప్రచారం కోసం చేసి ఉండొచ్చని సీపీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News