Fastag: పేటీఎం ద్వారా ఫాస్టాగ్ చెల్లింపులు.... మనీబ్యాక్ ఆఫర్ కూడా
- రూ.400 చెల్లిస్తే సరిపోతుంది
- వాహన చోదకులకు మరో సదుపాయం
- డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహమే లక్ష్యం
జాతీయ రహదారులపై దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్న ఫాస్టాగ్ సదుపాయంలో మరో అంశాన్ని జోడించారు. వాహన చోదకులు పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపి ఫాస్ట్ ట్యాగ్ ను పొందవచ్చునని సంస్థ ప్రకటించింది. రూ.400 చెల్లించి పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ ను కొనుగోలు చేయవచ్చని, ఇందులో 250 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గాను, మిగిలిన 150 రూపాయలు ఖాతాదారుని అకౌంట్ లో కనీస నిల్వగా ఉంటుందని పేర్కొంది. ఖాతాదారులు పేటీఎం అకౌంట్, వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి పంపిణీ ఖర్చును పేటీఎం పేమెంట్స్ బ్యాంకు చెల్లించనుంది. పేటీఎం ద్వారా ఫాస్ట్ ట్యాగ్ ను కొంటే 2019-20 సంవత్సరానికి గాను అన్ని టోల్ గేట్ల వద్ద చెల్లింపులు జరిపిన మొత్తంలో 2.5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.