Andhra Pradesh: దైవాశీస్సులు లేనిదే న్యాయాధికారుల బాధ్యతల్లో వుండటం సాధ్యం కాదు: జస్టిస్ మహేశ్వరి
- గుంటూరులో న్యాయాధికారుల సదస్సు ప్రారంభం
- పెండింగ్ కేసులు, జ్యుడిషియల్ అకౌంటుబిలిటీ పై చర్చ
- న్యాయమూర్తుల తీర్పులతో ప్రజల జీవితాలు ముడిపడి వుంటాయి
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కే మహేశ్వరి పాల్గొన్నారు. ‘విధులు-లక్ష్యాలు’ అనే అంశంపై న్యాయమూర్తులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసులు, జ్యుడిషియల్ అకౌంటుబిలిటీ, బెంచ్, బార్ అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా తీర్పులు చెప్పే స్థితిలో వుండటం అరుదైన అవకాశమని, దైవాశీస్సులు లేనిదే న్యాయాధికారుల బాధ్యతల్లో వుండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
‘ఒక వ్యక్తి రాత, అదృష్టాన్ని మీరు నిర్ణయిస్తారు. ఇంకెవరికీ ఇలాంటి అధికారం లేదు. అయితే, ఆ అధికారాన్ని సద్వినియోగం చేసినప్పుడే న్యాయం వర్థిల్లుతుంది’ అని అన్నారు. న్యాయమూర్తుల తీర్పులతో ప్రజల జీవితాలు ముడిపడి వుంటాయని, బాధిత ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.62 లక్షల కేసులు పెండింగ్ లో వున్నాయని, ఈ కేసులను సత్వరమే పరిష్కంచాలని ఆదేశించారు. వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో హైకోర్టు సహా అన్ని జిల్లాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.