Disha: వెటర్నరీ వైద్యురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి... గేటు వద్దే ఆపేసిన పోలీసులు!
- గేటుకు తాళం వేసిన స్థానికులు
- స్పందించిన రేవంత్ రెడ్డి
- సీఎం కేసీఆర్, మంత్రులు ఇంతవరకు రాలేదని విమర్శలు
హైదరాబాద్ శివారు ప్రాంతంలో వెటర్నరీ వైద్యురాలు దారుణమైన రీతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. అత్యాచారం అనంతరం ఆమెను దుండగులు హత్య చేసిన నేపథ్యంలో యావత్ పౌర సమాజం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి నిరాశ ఎదురైంది. శంషాబాద్ లో ఆమె కుటుంబం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ విల్లా వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు గేటు వద్దే నిలిపివేశారు.
అంతకుముందే స్థానికులు గేటెడ్ విల్లా మెయిన్ గేటుకు తాళం వేశారు. పోలీసులను, మీడియా ప్రతినిధులను ఎవ్వరినీ లోనికి అనుమతించడంలేదు. తమకు పరామర్శలు అక్కర్లేదని, న్యాయం కావాలంటూ స్థానికులు నినాదాలు చేస్తుండడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
కాగా, రేవంత్ శంషాబాద్ ఘటనపై స్పందిస్తూ, ఈ ఘటనలో నిఘా వైఫల్యం, పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు స్పందించిన తీరు దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, ఇతర మంత్రులు ఇంతవరకు రాలేదని మండిపడ్డారు. ఇది మానవీయ కోణంలో స్పందించాల్సిన అంశం అని స్పష్టం చేశారు.