Disha: హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు
- 'దిశ' ఘటనపై రాజ్యసభలో చర్చ
- మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముంది
- చట్టాలు చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదు
- ఇప్పటికే ఉన్న చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది
'హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు' అని దిశ హత్యాచార ఘటనను ఉద్దేశించి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. 'దిశ' హత్యాచార ఘటనపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదని చెప్పారు.
'ఇప్పుడు కొత్త బిల్లు తీసుకురావడం కాదు.. ఇటువంటి దాడులను అరికట్టాలన్న రాజకీయ సంకల్పం మనకు కావాలి. సమర్థవంతమైన పరిపాలన నైపుణ్యాలు ఉండాలి. మనుషుల ఆలోచనా విధానం మారాలి. అప్పుడే సమాజంలో ఇటువంటి చెడును సమూలంగా నాశనం చేయగలం' అని వ్యాఖ్యానించారు.