Pawan Kalyan: నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నాను: పవన్ కల్యాణ్
- భాషజోలికొస్తే ఊరుకునేది లేదు
- తెలుగు కవుల రచనలపై కార్యశాలలు నిర్వహించాలి
- మన నుడి- మన నది కార్యక్రమ లక్ష్యమిదే
- ఏడు కొండలస్వామి సమక్షంలో ప్రారంభించడం మా అదృష్టం
తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ల పరిధిలోని నియోజకవర్గాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు వైభవం - తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో ఉర్దు, కన్నడ, ఒడియా, తమిళం, బెంగాలీ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని, వాటిని వదిలేసి తెలుగు మాధ్యమం జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. భాషజోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
'నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆంగ్ల మాధ్యమం చదువే గొప్ప అయితే, ఆ మాధ్యమంలో చదివిన వారు అవినీతికి పాల్పడి జైలుకు ఎందుకు వెళ్లారు? తెలుగు కవుల రచనలపై కార్యశాలలు నిర్వహించాలి. మన నుడి- మన నది కార్యక్రమ లక్ష్యమిదే. ఏడు కొండలస్వామి సమక్షంలో ప్రారంభించడం మా అదృష్టం. తెలుగు సినిమాలో మన సాహిత్యం రోజురోజుకు దిగజారిపోతోంది. తెలుగు భాష నిర్లక్ష్యం కావడానికి తరతరాలుగా వ్యవస్థను నడుపుతోన్న పాలకుల నిర్లక్ష్యమే కారణం' అని వ్యాఖ్యానించారు.