APSRTC: టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తేడా ఇది!

  • ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో పోలిస్తే 20 శాతం చార్జీ అధికం
  • బస్సులు ఎక్కేందుకు ప్రయాణికుల విముఖత
  • కిటకిటలాడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేటి నుంచి బస్సు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసల మేరకు చార్జీలు పెరుగగా, దాని ప్రభావం ప్రయాణికులపై ఎక్కువగానే ఉంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సుల్లో టీఎస్ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు విముఖత చూపించారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతుండగా, పెంచిన చార్జీల నేపథ్యంలో తెలంగాణ బస్సులకు స్పందన కరవైంది.

ఇక కొన్ని ప్రధాన రూట్లలో చార్జీలను పరిశీలిస్తే, హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 317, గరుడలో రూ. 467, అమరావతిలో రూ. 544, వెన్నెలలో రూ. 724 ఉండగా, టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 355, రాజధానిలో రూ. 438, గరుడలో రూ. 535గా ఉంది.

హైదరాబాద్ నుంచి కర్నూలుకు పరిశీలిస్తే, ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 246, ఇంద్రలో రూ. 310, అల్ట్రా డీలక్స్ లో రూ. 234 ఉండగా, టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 288, గరుడా ప్లస్ లో రూ. 429 చార్జీని వసూలు చేస్తున్నారు.

ఇక తిరుపతి విషయానికి వస్తే, ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 652, అమరావతిలో రూ. 1,119, వెన్నెలలో రూ. 1,291 వసూలు చేస్తుండగా, టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో రూ. 694 (కడప మీదుగా) నుంచి రూ. 748 (మాచర్ల, ఒంగోలు మీదుగా) మధ్య, రాజధానిలో రూ. 892, గరుడలో రూ. 1,104 వసూలు చేస్తున్నారు.

కాగా, తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బాసర వంటి ప్రాంతాలకు తిరిగే ఏపీ బస్సుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో తెలంగాణలోని ప్రాంతాలకు వెళ్లే వారు మాత్రమే టీఎస్ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారంతా ఏపీ బస్సుల కోసం వెతుక్కుంటున్నారు. ఆన్ లైన్ రిజర్వేషన్ లోనూ ఇదే పరిస్థితి. సమ్మె మొదలైన తరువాత ఆగిపోయిన తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ నేడు ప్రారంభం అయింది. టికెట్ల బుకింగ్ ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్లు మందకొడిగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News