Jagan: జగన్ ను ముఖ్యమంత్రిగా కచ్చితంగా గుర్తించను: పవన్ కల్యాణ్
- రాయలసీమలో పవన్ పర్యటన
- తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం
- అధికార పక్షంపై వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో సీఎం జగన్ పైనా, వైసీపీ నేతలపైనా నిప్పులు చెరిగే ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో న్యాయవాదుల సమావేశంలో కూడా పవన్ అదేరీతిలో స్పందించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటివాళ్లు పదవుల కోసం ప్రజల్లోకి రాలేదని, వాళ్లు చేసిన గొప్ప పనుల వల్లే నిత్యం వారిని స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ, జగన్ ను ముఖ్యమంత్రిగా కచ్చితంగా గుర్తించనని తెగేసి చెప్పారు. రాయలసీమలో బత్తాయిచెట్లు నరికించడం ఏం మానవత్వం? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి చెడ్డపేరు ఎవరు తెచ్చారు? అని నిలదీశారు.
వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని, ఏ అంశంపై మాట్లాడుతున్నారో వారికసలు అవగాహన ఉందా? అని వ్యాఖ్యానించారు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే నిత్యం బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో కష్టసమయంలోనే జనసేన పార్టీ పెట్టానని, మార్పు తెచ్చేందుకు జనసేన కంకణం కట్టుకుందని తెలిపారు. భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.