YCP MLA Undavalli Sridevi criticism on Chandrababu naidu: ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును మరిచారు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్
- మాకు 50శాతం ఓట్లు 80శాతం సీట్లు వచ్చాయి
- రాజధాని నిర్మాణంలో అక్కడి రైతులను మభ్య పెట్టారు
- మంచి చేస్తే ప్రజలు హారతులు పడతారు.. చెడుచేస్తే రాళ్లు విసురుతారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును లెక్కలోకి తీసుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. ఈ రోజు ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ బాబు మంగళగిరిలో ఓడిపోయారు దానిపై విచారించారా? అంటూ ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. తాడికొండలో అదేవిధమైన ఫలితాన్ని ఎదుర్కొన్నారని, ప్రజలు ఇంత గట్టిగా తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబుకు పశ్చాతాపం కలుగలేదని మండిపడ్డారు.
ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించానన్న భ్రమలో ఆయన ఉన్నారని విమర్శించారు. రాజకీయాల్లో తనకు 40 ఏళ్ల అనుభముందంటున్న చంద్రబాబు, భూములిచ్చిన రైతులను కనీసం క్షమాపణలు కూడా కోరలేదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే హారతులు పడతారని, చెడుచేస్తే రాళ్లువిసురుతారని ఆమె చెప్పుకొచ్చారు. భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు నిరసన తెలిపితే.. వారిని మీరు ఉగ్రవాదులతో పోల్చారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
‘మా పార్టీకి 50శాతం ఓట్లు వచ్చాయి. 80 శాతం (సుమారు 151 స్థానాలు) సీట్లను ప్రజలు మాకు కట్టబెట్టారు. ఈ విషయాన్ని మీరు ఎలా విస్మరిస్తున్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు. గ్రాఫిక్స్ పై పెట్టిన ఖర్చును ప్రజల సంక్షేమానికి పెడితే వారు సంతోషపడేవారు. రాజధానికోసం భూములు ఇవ్వని రైతులను హింసించారు. పంటలను తగులబెట్టారు. బెదిరించి భూములను లాక్కున్నారు. రైతుల కళ్లల్లో కారంకొట్టి.. మళ్లీ అక్కడ పర్యటన చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నారు’ అని విమర్శించారు.