Pawan Kalyan: ఎవరి అండతో ఏపీలో సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయి?: పవన్ కల్యాణ్ ధ్వజం
- తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోంది
- స్థానికులు ఈ విషయంపై వాపోతున్నారు
- హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై నా వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించింది
- సామూహిక మత మార్పిడి జరుపుతోన్న వీడియోను విడుదల చేస్తా
తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా తన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందని ఆయన చెప్పారు. మాటలను వక్రీకరించడమనేది వైసీపీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండతో ఏపీలో సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన నిలదీశారు.
'నేను మీడియా సంస్థలకు కూడా చెబుతున్నాను. నేను మీకు వీడియో విడుదల చేస్తాను. సామూహిక మత మార్పిడి జరుపుతోన్న వీడియోను కూడా మీకు పంపుతాను. దాన్ని కూడా సంచలనం చేయండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి' అని పవన్ సూచించారు.
'వక్రీకరిస్తూ కాదు.. వాస్తవంగా జరుగుతోన్న విషయాలను చెప్పండి. మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి. లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. పాలన సరిగ్గా ఉండాలి' అని పవన్ అన్నారు.