Janasena: రాజకీయ కారణాలతో ‘ఆరడుగుల బుల్లెట్’ను మా నుంచి సంధించాలనుకుంటే పొరపాటే: ఎంపీ జీవీఎల్
- ‘జనసేన’ను బీజేపీలో విలీనం చేయాలనుకుంటే స్వాగతిస్తాం
- మా నాయకత్వం కొత్త ఒరవడిని ఇష్టపడుతోంది
- మాతో ఏ పార్టీ విలీనం కాదలచుకున్నా మేము సిద్ధమే
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ ని అడిగామని, అప్పుడు, ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరి, ఇప్పుడు ఏమైనా పవన్ కల్యాణ్ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.
‘మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్ (పవన్ కల్యాణ్) ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.. కలిసి పనిచేసేలా మేమందరం ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్ పేర్కొన్నారు.