Sabarimala: వైరల్ అవుతున్న శబరిమల గర్భగుడి చిత్రాలు... కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం బోర్డు!
- ఆలయంలో సెల్ ఫోన్లపై నిషేధం
- 18 మెట్లు దాటిన తరువాత అమలు
- భక్తులు సహకరించాలన్న అధికారులు
మిగతా ప్రధాన ఆలయాల్లో మాదిరిగా, శబరిమలలో సెల్ ఫోన్లపై నిషేధం లేదు. సీజనల్ టెంపుల్ కావడం, ఒక్కసారిగా వచ్చే లక్షలాది మంది భక్తుల సెల్ ఫోన్లను భద్రపరిచే వీలు లేకపోవడంతో, భక్తులు తమ ఫోన్లను తమతో పాటే తీసుకెళుతుంటారు. ఆలయంలో సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీయడంపై నిషేధం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో స్వామి గర్భగుడి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందించిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, ఆలయంలో ఫోన్లపై నిషేధాన్ని విధించింది. 18 బంగారు మెట్లు దాటిన తరువాత ప్రధాన ఆలయం ఎదురుగా, గర్భగుడి వద్ద మొబైళ్లను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు విధిగా తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేయాలని ఆదేశించారు. తొలిసారి ఉల్లంఘిస్తే, హెచ్చరికతో వదిలిపెడతామని, రెండోసారి ఉల్లంఘిస్తే, ఆ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విజువల్స్ తొలగిస్తామని అధికారులు వెల్లడించారు.