Tumers: కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళితే...కడుపునిండా కణతుల గుర్తింపు!
- మహిళ పొట్టలో 759 కణతులు
- పొట్టలో సగభాగం ఆక్రమించుకున్నది ఇవే
- ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
కడుపునొప్పి తాళలేక ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ పొట్టలోని పరిస్థితి చూసి అక్కడి వైద్యులు కంగుతిన్నారు. పొట్టలోని సగభాగం కంటే ఎక్కువ ప్రాంతంలో పెద్ద పెద్ద కణతులను గుర్తించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 759 చిన్నా పెద్ద కణతులు ఉండంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది.
వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన 29 ఏళ్ల ఓ మహిళను కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపునొప్పి వేధిస్తోంది. ఆహారం సహించక పోవడం, బలవంతంగా తిన్నా వెంటనే వాంతి కావడం జరిగేది. చాన్నాళ్ల నుంచి పడుతున్న ఇబ్బంది నుంచి ఉపశమనం లభించక పోవడంతో స్థానికంగా ఉన్న సవితా వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆమె చేరింది.
ఆసుపత్రి జనరల్ సర్జన్ సుందరవదనన్ బృందం ఆమెకు సీటీ స్కాన్ చేయించారు. ఆమె పొట్టలో నాలుగు పెద్ద కణతులు, వాటికి అనుబంధంగా మరికొన్ని చిన్న కణతులు ఉన్నట్లు గుర్తించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి మొత్తం 759 కణతులను తొలగించారు.
సదరు మహిళ 'హైడాటిడ్' అనే వ్యాధితో బాధపడుతోందని డాక్టర్ సుందరవదనన్ తెలిపారు. కలుషిత నీరు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారికి సాధారణంగా ఈ వ్యాధి సోకుతుందన్నారు. కుక్కలు, గొర్రెల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువని తెలిపారు. ఏదిఏమైనా ఉదరంలో ఇంత పెద్ద కణతులు ఉండడం వైద్యచరిత్రలో అరుదైన ఘటనని పేర్కొన్నారు.